అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రభుత్వాలు మారుతాయే తప్ప అధికారులు మారరని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తేల్చి చెప్పారు. అలాంటి అధికారుల మీద వేధింపులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడి.. వారి మీద మరక వేసే కార్యక్రమం చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో చెత్త ముఖ్యమంత్రితో కూడిన చెత్త కేబినెట్ ప్రజల బ్రతుకులను బుగ్గిపాలు చేస్తోందని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రులైతే అసలు అడ్రస్ లేకుండా పోయారన్నారు. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా, ఆదివారం వరకు సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ (వాతావరణ శాఖ) ముందే హెచ్చరించినా, ఎందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించారు. చిన్న సంఘటన జరిగితే వెంటనే తాను ప్రజల పక్షాన ఉంటానని చెప్పుకునే డిప్యూటీ సీఎం.. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నారు. ప్రజలకు తాను అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్ ఆదివారం తూతూ మంత్రంగా కనిపించి వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వాటిని విస్మరించిం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో వారున్నారని కాకాణి దుయ్యబట్టారు.