గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు ఇతర ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొసైటీల్లో అక్రమాలకు అవకాశం లేకుండా లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ప్రక్రియను చేపట్టింది. ఒంగోలు జిల్లాలోని సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ) పరిధిలోని 172 సొసైటీలు కంప్యూటరీకరణ పనులు ప్రారంభించాయి. మొత్తం రూ.6.72 కోట్లతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సొసైటీలను కంప్యూటరీకరిస్తున్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి నాటికి జిల్లాలో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. కంప్యూటరీకరణ కోసం ఒక్కో సొసైటీకి ప్రభుత్వం రూ.3.91లక్షలు వెచ్చిస్తోంది. కంప్యూటర్, యూపీఎస్, వెబ్‌కామ్, బయోమెట్రిక్ స్కానర్, పాస్‌బుక్ ప్రింటర్, విద్యుత్ సౌకర్యం కోసం రూ.1.22 లక్షలు కేటాయించింది. డేటా నిర్వహణ, సైబర్ సెక్యూరిటీకి రూ.72వేలు, కంప్యూటరీ కరణపై సొసైటీ సిబ్బంది శిక్షణ కోసం రూ.10వేలు, డేటా ప్రిపరేషన్, డిజిటలైజేషన్, వెరిఫికేషన్‌కు రూ.1.10 లక్షలు, నిర్వహణ, హ్యాండ్లింగ్ సపోర్టుకు రూ.76వేలు వెచ్చించనున్నారు.