కొత్తూరు పరిధిలోని నేరడి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మురళీపేటకు చెందిన సనపల విష్ణు కార్పెంటర్, ఎలక్ర్టికల్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం నేరడిలో నిరుపయోగంగా ఉన్న పంపుషెడ్ నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు గుర్తించారు. విష్ణు మృతదేహం గుర్తించి వీఆర్వో శ్రీనుకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విష్ణు నాలుగు రోజులుగా ఇంటికిరాలేదని, మద్యం మత్తులో మృతి చెంది ఉండొచ్చని భార్య అన్నమ్మ ఫిర్యాదు మేరకు కొత్తూరు ఎస్ఐ ఎంఏ అహ్మద్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. విష్ణుకి కుమారుడు మణికంఠ ఉన్నారు.