పొందూరు మండల కేంద్రంలోని మహరాజా మార్కెట్లో బుధవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. మార్కెట్కు సరుకులు కొనుగోలు కోసం వచ్చినవారి పైనా, స్థానికులపైనా దాడిచేసింది. దీంతో 27 మందికి గాయాలయ్యాయి. వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పొందూరు గ్రామానికి చెందిన జి.అన్నాజీ, వి.వెంకటగోవిందరావు, ఆర్.పారారావు, గారపేటకు చెందిన యు.సుజాత, ఎ.ప్రదీప, వి.జోగలమ్మ, వి.చిరంజీవి, మజ్జిలపేటకు చెందిన వి.మల్లేశ్వరరావు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కుక్కలు గుంపులు, గుంపులుగా సంచరిస్తుండడంతో మార్కెట్కు వచ్చేవారు హడలిపోతున్నారు. కుక్కల నియంత్రణకు పంచాయతీ సిబ్బంది దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.