విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు కాలువ మళ్లీ ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకతలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆరుగొలను గ్రామం దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వేళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఆరుగొలను గ్రామాన్ని బుడమేరు వరద చుట్టుముట్టింది. అయితే అంతకుముందు అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చటానికి చర్యలు చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం తెల్లవారుజాము దగ్గర నుంచి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ బుడమేరకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని తెలియడంతో గండ్లను శరవేగంగా పూడ్చటానికి ప్రయత్నిస్తున్నారు. బుడమేరుకు పై నుంచి వరద ఎక్కువగా వస్తుండటంతో గండ్లను పూడ్చలేకపోతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులను సమీక్షిస్తున్నారు. మరోవైపు బుడమేరు ముంచెత్తడంతో. 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో వరదను తొలగించే పనులు వేగంగా జరుగుతుండటంతో 80 శాతం ముంపు నుంచి కాలనీలు బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరిస్తున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై మంత్రులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. అయితే ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు.వాటిద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన బురద, మురుగును తొలగించే పనులను శరవేగంగా చేపడుతున్నారు.