ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్ జోన్‌లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు. వరదలు రావడంతో బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్.. ఇవ్వన్నీ కాదు.. కరకట్టపై ఉన్న బాబు నివాసం కూల్చేసి శభాష్ అనిపించుకో అని అన్నారు. మాజీ మంత్రి అంబటి గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో వరదలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే మృతదేహాలు బయట పడుతున్నాయి. వైయస్ జగన్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయి. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ముందస్తు చర్యలు ఏం చేపట్టారో ప్రజలకు చెప్పాలి.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వానికి ముందే అలర్ట్ వచ్చింది. హెచ్చరికలు వస్తే అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్ పెట్టారా?. వరదలు సంభవిస్తే చంద్రబాబు సమీక్ష నిర్వహించలేదు. గత నెల 28వ తేదీనే అలర్ట్ వస్తే అధికారులను అప్రమత్తం చేయలేదు. ఎవరిపై కక్ష సాధిద్దాం. ఎవరిని వేధించాలి అనే ఆలోచనేతోనే ఉన్నారు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదు అని మండిపడ్డారు.