ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బలాత్కారం... బెదిరించి రేప్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. నిన్న (గురువారం) రాత్రి 11:15 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే ఈస్ట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సంఘటన జరిగిన బీమాస్ పారడైజ్ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 430/24, డేట్: 5-9-2024 కింద ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ వ్యవహారానికి సంబంధించి చట్ట పరమైన చర్యల తీసుకునేందుకు నిన్న(గురువారం) ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీకి చెందిన మహిళ కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు, తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని బాధితురాలు తెలిపింది.