భారీ వర్షాలతో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్థాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ హెచ్చరించారు. అటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.3 అడుగులకు చేరింది. కాగా.. కోస్తా పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న(గురువారం) ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తరంగా పయనించే క్రమంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో నిన్న ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.