భారీ వర్షాలతో మహోగ్రరూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్టు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎడతెరపిలేని వర్షాలు బెజవాడ వాసులను భయబ్రాంతులకు గురి చేశాయి. వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే వారం రోజుల అనంతరం విజయవాడ వాసులకు సూర్య భగవానుడు ఈరోజు దర్శనమిచ్చారు. గడిచిన వారం రోజులుగా వర్షాలు, ముసురు పట్టిన కారణంగా సూర్య భగవానుడు కనపడని పరిస్థితి. అయితే ఈరోజు ఉదయమే సూర్యుడు కనిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.