దేశంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్లపై కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనతోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాదిలో దేశంలో ఇప్పటి వరకు 150 మందికి పైగా నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారన్నారు.
రెండు రోజుల క్రితం 9 మంది, గురువారం మరో ఆరుగురిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్కౌంటర్లన్నీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, వెంటనే వీటిని ఆపాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ల వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చని, దానికే వారి ప్రాణాలు తీయడం అన్యాయమని కూనంనేని పేర్కొన్నారు.