ఏపీని వరుణుడు వదలనంటున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది.ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం.. వాయువ్య దిశగా కదులుతోంది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. చెరువుల్లోకి వరదనీరు చేరుతోంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో తుపాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే విద్యుత్ శాఖ కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. అవసరమైతే సంప్రదించాలని కోరింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో సోమవారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్న శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. మరోవైపు ముందుజాగ్రత్తల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులను 08942-240557 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణశాఖ .. ఈ జిల్లాలలోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం డ్యామ్‌లో 2.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 3.09 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నాగార్జునసాగర్, పులిచింతలలోనూ వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, పరివాహక గ్రామాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.