వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి, దివ్వెల మాధురి వ్యవహారం ఇటీవల మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తోంది. కొంతకాలంగా భార్య వాణి, ఇద్దరు కుమార్తెలకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్... దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. కొన్నివారాలుగా నడుస్తున్న ఈ వ్యవహారంలో నిన్న ఆసక్తికర ఎపిసోడ్ చోటుచేసుకుంది. దువ్వాడ నిర్మిస్తున్న కొత్త ఇంట్లోకి దివ్వెల మాధురి రావడంతో దుమారం రేగింది. రెండో ఫ్లోర్ బాల్కనీలో మాధురి ఉండడాన్ని గమనించిన వాణి, ఆమె ఇద్దరు కుమార్తెలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వారు ప్రవేశించగా, పోలీసులు అడ్డుకుని వారిని అక్కడ్నించి తరలించారు. ఈ నేపథ్యంలో, దివ్వెల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ నిర్మిస్తున్న ఆ కొత్త ఇల్లు తన పేరిట రిజిస్ట్రేషన్ అయిందని వెల్లడించారు. దువ్వాడకు గతంలో తాను రూ.2 కోట్లు ఇచ్చానని, ఆ తర్వాత మరోసారి రూ.50 లక్షలు ఇచ్చానని వివరించారు. అందుకు బదులుగానే ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. అందువల్ల తన అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి రావడానికి ఎవరికీ అనుమతి లేదని మాధురి స్పష్టం చేశారు. కాగా, దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని తన క్యాంపు కార్యాలయం అని చెబుతుండడంపైనా మాధురి స్పందించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే ఆ ఇంటిని దువ్వాడకు అద్దెకు ఇస్తానని వెల్లడించారు. అటు, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ ఇంటిపై స్పష్టత ఇచ్చారు. దివ్వెల మాధురి నుంచి తాను రెండున్నర కోట్లు తీసుకున్నది నిజమేనని చెప్పారు. తిరిగి ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని, చేసేది లేక ఆ ఇంటిని ఆమె పేరిట రాసేశానని వెల్లడించారు.