హైదరాబాద్‌లో ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తున్న హైడ్రా పేరు ఏపీలోనూ మార్మోగుతోంది. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ.. నిర్మాణాలను కూల్చివేస్తున్న వైనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బుడమేరు ఆక్రమణ, విజయవాడలో వరదల నేపథ్యంలో ఏపీలోనూ హైడ్రా తేవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాను తీసుకువచ్చి రేవంత్ రెడ్డి మంచిపని చేశారంటూ ఇటీవల పవన్ కళ్యాణ్.. మెచ్చుకున్నారు. అయితే నిర్మాణాలను కూల్చివేసే మందు వారికి పరిహారం కూడా ఇవ్వాలంటూ ఇటీవలే సలహా కూడా ఇచ్చారు. అయితే బుడమేరు వాగు ఆక్రమణ నేపథ్యంలో ఇక్కడ కూడా హైడ్రా వంటి వ్యవస్థ తేవాలంటూ కొంతమంది విలేకర్లు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
సోమవారం కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే హైడ్రా ప్రస్తావన వచ్చింది.అయితే బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. బుడమేరులో ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారన్న పవన్ కళ్యాణ్.. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చుని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడుతున్నామన్న పవన్ కళ్యాణ్.. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు సామాన్య ప్రజలు నష్టపోయారన్న పవన్.. ఆ తప్పులను సరిచేస్తున్నామన్నారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొన్నారని.. మార్కెట్ ధర 30 లక్షలు ఉంటే రూ.60 లక్షలకు కొనుగోలు చేశారని ఆరోపించారు.
మరోవైపు అకస్మాత్తుగా వచ్చిన భారీ వానలతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న పవన్ కళ్యాణ్.. వరదల నుంచి కోలుకోవడానికి విజయవాడకు కాస్త సమయం పడుతుందన్నారు. అమెరికాలో వరదలు వచ్చినా కోలుకోవడానికి టైమ్ పడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపుప్రజల బాధలు వినేందుకే తన ఆరోగ్యం బాలేకున్నా.. క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.