ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఏపీలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా విజయవాడ వణికిపోయింది. బుడమేరు వాగు ఉద్ధృతితో చాలా ప్రాంతాలు నీటమునిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్లల్లోని నిత్యావసర సరుకులు తడిచిపోయాయి. వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల వాసులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితులకు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా వరదనీటిలో తడిచిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచితంగా సర్వీస్ అందిస్తామని ప్రకటించింది. అలాగే ఎల్‌జీ ఉత్పత్తుల స్పేర్ పార్టులపైనా 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఎల్‌జీ ఉత్పత్తులు పాడైతే తమను సంప్రదించాలని ఎల్‌జీ సంస్థ కోరింది.
మరోవైపు వరదల్లో దెబ్బతిన్న వాహనాల క్లెయిమ్‌ల పరిష్కారం కోసం కూడా బీమా కంపెనీలు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశాయి. ఇవాళ్లి నుంచి ( సెప్టెంబర్ 9) నుంచి ఈ ఫెసిలిటేషన్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా క్లెయిమ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా నమోదు చేయవచ్చన్నారు. అలాగే అసెస్‌మెంట్ కోసం సర్వేయర్ నియామకం, ఫారాల సమర్పణతో పాటుగా క్లెయిమ్‌ల పరిష్కారం జరుగుతుందని ప్రకటనలో వెల్లడించారు.
మరోవైపు బీమాదారుల క్లెయిమ్‌ల పరిష్కారం విషయంలో ఫాలో అప్‌ల కోసం కూడా ఫెసిలిటేషన్ కేంద్రం ఉపయోగపడనుంది. ఈ కేంద్రంలో అన్ని బీమా కంపెనీల ప్రతినిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ ఫెసిలిటేషన్ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో కోరారు. వరదల నేపథ్యంలో ఇటీవల బ్యాంకర్లు, బీమా కంపెనీలతో భేటీ అయిన చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించాలని, అలాగే బ్యాంకులు కూడా రుణాలు రెన్యువల్ చేయడం సహా కొత్త రుణాలు ఇవ్వాలని సూచించారు.