ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జిల్లా పరిషత్తు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ దంపతులు మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పారు. పద్మశ్రీ వైఎస్సార్‌సీపీకి .. ఆమె భర్త ప్రసాదరావు పార్టీకి, బీసీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాము వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కానీ జనసేన పార్టీకి ట్విస్ట్ ఇస్తూ.. కొన్ని గంటల్లోనే దంపతులు యూటర్న్ తీసుకున్నారు.
జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు.. విశాఖపట్నంలో తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కలిశారు. ఆయన సమక్షంలో ఘంటా ప్రసాదరావు తెలుగు దేశం పార్టీలో చేరారు.. ఆయనకు పల్లా శ్రీనివాస్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ త్వరలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ చేరబోతున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు జిల్లాలో వైఎస్సారీసీపకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తాము జనసే పార్టీలో చేరతామని ప్రకటించారు. తాము గత పదమూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం కష్టపడి పని చేశామని.. కొన్ని వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతల్ని చూస్తున్నారని..
ఆయన నేతృత్వంలో జిల్లా పరిషత్తు ద్వారా ప్రజలకు సేవలందించాలని తాము భావిస్తున్నామన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు.
అలాగే తాము త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతామని ప్రకటించారు. జెడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామాతో జిల్లా రాజకీయం మారిపోయింది.. జిల్లా పరిషత్‌పై కూటమి జెండా ఎగరబోతుందనే టాక్ మొదలైంది. త్వరలో పలువురు జెడ్పీటీసీలో పార్టీ మారబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే జనసేన పార్టీలో చేరతామని చెప్పిన ఘంటా దంపతులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.. మూడు రోజులకే యూటర్న్ తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఘంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు వెళ్లి తెలుగు దేశం పార్టీలో చేరారు. భర్త బాటలో భార్య పద్మశ్రీ కూడా నడవబోతోందని.. ఆమె కూడా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది.