ఏపీలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై ప్రభుత్వం మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపించింది. ఆగస్టు 31వ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారని నివేదికలో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో 31 మంది చనిపోగా.. ఇద్దరు గల్లంతయ్యారు.. వీరిలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని.. తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు రూ.6,880 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. వాతావరణ మార్పులు, ప్రభావం, కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీ డిజైన్‌ను పునఃపరిశీలించడంతోపాటు.. కరకట్టలను బలోపేతం చేయాలని కూడా ఆ నివేదికలో ప్రస్తావించారు.
కేంద్రానికి పంపిన నివేదికలో ఏపీ ప్రభుత్వం మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్టను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపింది. అలాగే విజయవాడలో పలు ప్రాంతాలు ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా ముంపు బారిన పడుతున్నాయి. అందుకే బుడమేరు డ్రెయిన్‌తో పాటుగా డైవర్షన్ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 2.32 కుటుంబాలు, 7.04 లక్షలమందిపై వరద ప్రభావం పడింది. విజయవాడలోని
32 వార్డులతోపాటు 5 గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేయగా.. రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.341.30కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు చనిపోగా.. 226 పడవలు పాక్షికంగా, 217 పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈ వర్షాలు, వరదలకు ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,869 కి.మీ, పంచాయతీరాజ్ రోడ్లు 353 కి.మీ దెబ్బతినగా.. మొత్తం 79 చోట్ల గండ్లు పడ్డాయి. వరద నీరు 238 చోట్ల రోడ్లపైన పారింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడగా.. పురపాలకశాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీటమునిగాయని నివేదికలో పేర్కొన్నారు. 558 కి.మీ. మేర రోడ్లు దెబ్బతినగా.. 6,382 వీధి దీపాలు పాడైపోయాయి. అంతేకాదు 195 కి.మీ తాగునీటి పైపులైన్లకు నష్టం ఏర్పడింది.
మరవైపు విజయవాడ వరద ప్రాంతాల్లో 1200 వాహనాలతో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటివరకు 80 సచివాలయాల పరిధిలో రేషన్ పంపిణీ చేశామని.. వరద ప్రాంతాల్లో 7,100 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. వరద ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ చేస్తున్నామని.. సహాయక చర్యల్లో నిర్విరామంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందన్నారు. అంతేకాదు ఆపరేషన్ బుడమేరు వెంటనే ప్రారంభిస్తామని.. ల్యాండ్ గ్రాబర్స్, పోలిటికల్ సపోర్టుతో చేసేవారికి బుద్ది చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుంది అన్నారు.