ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామ స్వరాజ్యంపై ఉన్న ప్రేమ అపారమైనదని.. గ్రామాలకు అనుకోని కష్టం వస్తే వాటికి సహాయం చేయడం బాధ్యతగా ఆయన తీసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా.. వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల వ్యక్తిగత సాయం అందించడం చరిత్రలో నిలిచిపోయే దాతృత్వం అన్నారు. దీన్ని ప్రతి పంచాయతీకి నేరుగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి, జనసేన పార్టీ నుంచి ఈ నెల 9వ తేదీ సాయంత్రం అందరి సమక్షంలో నిర్వహిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 పంచాయతీలకు ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రతి పంచాయతికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తూ విరాళం ప్రకటించిన విషయాన్ని మనోహర్ గుర్తు చేశారు. ఈ విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలకు నష్టపోయిన ఆయా జిల్లాల్లోని పంచాయతి సర్పంచులు, కార్యదర్భులు వచ్చి విరాళం సొమ్మును అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో మనోహర్ టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ అందించే విరాళం పూర్తిగా ఆయా గ్రామాల అభివృద్ధికి, వరదలో నష్టపోయిన గ్రామ ఆస్తుల పరిరకక్షణకు, పారిశుద్ధ్యానికి, ఆరోగ్య శిబిరాలకు, ఇతర అవసరాలకు ఉపయోగపడాలన్నారు మంత్రి మనోహర్. గతంలో ఏ నాయకుడు ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ విపత్తు వేళ సొంత నిధులను పంచాయతిలకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సాయం ఎంత విలువైనదో అందరం గ్రహించాలని.. ఈ నిధులు ఆయన స్వార్జితం అన్నారు. అవి గ్రామాలకు ఉపయోగపడాలన్నదే పవన్ కళ్యాణ్ ఉద్దేశమని.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఆరు జిల్లాలకు సంబంధించి, 400 గ్రామ పంచాయతీలకు నిధులు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 20 చోట్ల ఈ కార్యక్రమాలు జరగనున్నాయని.. ప్రతి చోటా కూటమి నాయకులను ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అలాగే అధికారులకు సమాచారం ఇచ్చి కార్యక్రమం నిర్వహించాలి అన్నారు.
జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు ఎంత నిజాయతీగా అండగా ఉన్నారనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నిబద్ధత, పార్టీ సిద్దాంతాలను కూడా గ్రామాల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా నిర్వహిస్తున్నందున అధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని.. అందర్ని కలుపుకొని, సమష్టిగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పార్టీ పటిష్టత, గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. సాయాన్ని నేరుగా అందించే కార్యక్రమంలో సర్పంచులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.