మనం సాధారణంగా ఎక్కడైనా దూర ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడ రాత్రిపూట బస చేయడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటాం. ఆన్‌లైన్‌లోనే అక్కడ ఉన్న హోటల్స్‌లో రూం బుక్ చేసుకుంటాం. ఇక హోటల్స్ బిజినెస్‌లోకి ఓయో సంస్థ అడుగుపెట్టిన తర్వాత చిన్న చిన్న పట్టణాల దగ్గరి నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు అన్నిచోట్ల ఓయో రూంలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లగా.. ముందుగానే ఆన్‌లైన్‌లో ఓయో రూం బుక్ చేసుకున్నాడు. అయితే ఆ హోటల్‌కు వెళ్లి తాను బుక్ చేసుకున్న రూం తాళాలు ఇవ్వాలని ఓనర్‌ను అడగ్గా.. అందుకు అతడు నిరాకరించాడు. తాను ముందుగానే రూం బుక్ చేసుకున్నానని చెప్పినప్పటికీ అతడు వినలేదు. ఎంతకూ రూం ఇవ్వకపోవడంతో చివరికి తన కుటుంబంతో కలిసి ఆ వ్యక్తి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సదరు హోటల్‌పై కేసు వేయగా.. కోర్టు ఆ హోటల్‌కు భారీగా ఫైన్ విధించింది.
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అరుణ్ దాస్ అనే వ్యక్తి కొల్లాంలోని మంగలాట్ హోటల్‌లో రూం బుక్ చేసుకున్నాడు. ఒక్క రాత్రి ఉండడానికి ఓయో వెబ్‌సైట్‌లో రూ.2933 చెల్లించాడు. ఈ క్రమంలోనే తాను తన భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు, పిల్లలు కలిపి మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు రాత్రి 10గంటలకు ఆ హోటల్‌కు చేరుకున్నారు. అయితే వారికి రూమ్ ఇచ్చేందుకు ఆ మంగలాట్ హోటల్ ఓనర్ అంగీకరించలేదు. అంతేకాకుండా రూం కావాలంటే ఒక్కో రూమ్‌కు రూ.2500 అధికంగా ఇవ్వాలని హోటల్ ఓనర్ డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు.
దీనివల్ల తాను, తన పిల్లలు, తల్లిదండ్రులు 10 మంది రాత్రి మొత్తం తిరుగుతూ మరో రూం వెతుక్కునేందుకు నానా ఇబ్బందులు పడ్డామని అరుణ్ దాస్ వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఎర్నాకులం జిల్లా వినయోగదారుల కమిషన్.. సదరు హోటల్‌కు రూ.1.10 లక్షలు ఫైన్ వేసింది. బుక్ చేసుకున్న కస్టమర్‌కు రూం ఇవ్వనందుకు ఈ జరిమానా విధించినట్లు చెప్పింది. ఇందులో బాధితుడికి పరిహారం కింద రూ.1 లక్ష.. కోర్టు ఫీజుల కింద మరో రూ.10 వేలను నెల రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే తమ హోటల్, ఓయో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదని అందుకే తాను రూం ఇవ్వలేదని ఆ హోటల్ యజమాని కోర్టులో వాదించాడు. కానీ దాన్ని మాత్రం కోర్టులో నిరూపించలేకపోయాడు. దీంతో అతనికి కోర్టు భారీగా జరిమానా విధించింది. బాధిత కుటుంబం డబ్బులు చెల్లించి ఆన్‌లైన్‌లో రూం బుక్ చేసుకున్నా.. హోటల్ యజమాని ఇవ్వకుండా వారిని మోసం చేశాడని వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ డీబీ బిను.. సభ్యులు వి రామచంద్రన్, టీఎన్ శ్రీవిద్య తేల్చారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అర్ధరాత్రి రూంల కోసం వెతుక్కుంటూ మానసికంగా తీవ్ర క్షోభకు గురైందని.. అందుకే ఆ హోటల్ యజమానికి రూ.1.10 లక్షల ఫైన్ వేసినట్లు తెలిపారు.