బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బలిమెల డ్యామ్ వద్ద ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 30 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. గోవిందపురం (విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం)లో 14, కృష్ణదేవిపేట (అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం), చింతపల్లి(అల్లూరి జిల్లా)లో 13, ముంచంగిపుట్టు(అల్లూరి జిల్లా), పెదనడిపల్లి(చీపురుపల్లి)లో 12, కాకరపాడు(అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం), రణస్థలంలో 11, పూసపాటిరేగ, భీమిలి, బొండపల్లి, బలిఘట్టంలలో 10, మెరకముడిదాం, చీపురుపల్లి, విశాఖపట్నం, గరివిడి, గంపరాయి, నర్సీపట్నం, ఎస్.రాయవరంలలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ఒడిశాలోని మల్కన్‌గిరి, రాయగడ, గజపతి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. మల్కన్‌గిరిలో 25, చిత్రకొండలో 23, కొరుకొండలో 20, మథిలిలో 15, లమత్‌పుట్‌లో 13, అంబదోలలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒడిశాలో భారీవర్షాలు కురవడంతో అటు నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ప్రవహించే నదులు, వాగులకు వరద పోటెత్తింది. అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ ఒడిశాలో కురిసిన వర్షాలకు సీలేరు నదికి వరద పెరిగింది. 2006 తరువాత అత్యధికంగా శబరి నదిలో 10.27 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. ఈ వరద కూడా కూనవరం వద్ద గోదావరిలో కలుస్తోందని, దీంతో మంగళవారంకల్లా గోదావరి ప్రవాహం పెరుగుతుందని తెలిపారు. అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామంలో వరద బీభత్సంతోపాటు కొండచరియలు విరిగిపడటంతో గిరిజన యువతి కొర్రా కుమారి(20) మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.