సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికిగాను సహకార సంఘాల్లోని సభ్యత్వాలను ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టింది. సంఘాల్లోని సభ్యుల జాబితాలను ఆయా ఎంపీడీవోలకు అందజేసి గ్రామాల వారీగా సచివాలయ ఉద్యోగుల ద్వారా వివరాల సేకరణ చేయించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అప్పగించింది. సంఘాల్లో ఉన్న సభ్యులెందరు, వారిలో నకిలీలెవరు, అసలువారెవరనేది ఈ నెలాఖరులోగా తేలిపోనుంది. దీనికి తోడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (సింగిల్ విండోలు) బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్ పోర్టల్‌ను రూపొందించి నిజమైన సభ్యుల వివరాలను పూర్తిగా క్రోడీకరించి ఇందులో నమోదు చేస్తున్నారు. నకిలీలను తొలగిస్తే అసలైన సభ్యులతో ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.