ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37,421 చ.కి.మీ. సుసంపన్నమైన అటవీ సంపద ఉంది. మన రాష్ట్ర అడవుల్లో శ్రీగంధం, ఎర్ర చందనం లాంటివి విలువైన వృక్ష జాతులు, అద్భుతమైన వన్య ప్రాణులు ఉన్నాయి. అమూల్యమైన ఈ సహజ సంపదను అవిశ్రాంతంగా పరిరక్షించడంలో అంకిత భావంతో కూడిన మన రాష్ట్ర అటవీ సిబ్బంది ముందంజలో ఉన్నారు. అత్యంత విలువైన అటవీ వనరులను కాపాడుకునే కొన్ని కఠినమైన పరిస్థితుల్లో, తమ ధైర్యసాహసాలు ప్రదర్శించే సిబ్బందిలో కొందరు ప్రాణ త్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన చారిత్రాత్మక త్యాగాన్ని స్మరించుకొంటూ సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. మన అటవీ వనరుల రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ శాఖ అమరవీరులకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు స్మరణీయమైనవి. మన అడవులను, వన్యప్రాణులను, అటవీ సంపదను భావితరాలకోసం సంరక్షించే కీలకమైన విధులను నిర్వహించడానికి వీరి ధైర్యసాహసాలు, వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం పర్యావరణం పట్ల భాధ్యత కలిగిన ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది.