గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభను ఈ నెల 28వ తేదీన నిర్వహించాలనిఇ నిర్ణయించినట్టు ఎండీ వి.సన్యాసినాయుడు చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫ్యాక్టరీ అభివృద్ధికిఇ చేపట్టవలసిన చర్యలపై మహాజన సభలో చర్చిస్తామని తెలిపారు. 2024-25 క్రషింగ్ సీజన్‌ను డిసెంబరులో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. క్రషింగ్ ప్రారంభానికి అవసరమైన ముందస్తు చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఓవర్‌హాలింగ్ పనులు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పనుల కోసం కార్మికులను విధుల్లోకి(రీకాల్) తీసుకునేందుకు చైర్మన్ అయిన కలెక్టర్ అనుమతి ఇచ్చారని, గురువారం నుంచి కార్మికులు విఽధులకు హాజరవుతామరని ఆయన చెప్పారు.రానున్న క్రషింగ్ సీజన్‌లో ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసేందుకు 10 వేల ఎకరాల్లో మొక్క, కార్శీ తోటలకు సంబంధించి రైతులతో ఒప్పందాలు చేసుకున్నామని, ఇంకా తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును కూడా గోవాడలో క్రషింగ్ చేయడానికి కృషి చేస్తామని ఎండీ సన్యాసినాయుడు చెప్పారు. రానున్న సీజన్‌లో రెండు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు రైతులకు టన్నుకు రూ.2,500 చొప్పున చెల్లించామని, ఇంకా టన్నుకు రూ.419.75 చొప్పున రూ.7.16 కోట్లు, రవాణా ఛార్జీల బకాయిలు మరో రూ.46 లక్షలు చెల్లించాల్సి వుందన్నారు. గత సీజన్‌లో ఉత్పత్తి చేసిన పంచదార, మొలాసిస్‌లను విక్రయించి చెరకు రైతులకు బకాయిలు చెల్లించేదుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బుధవారం ఆరు వేల టన్నుల మొలాసిస్‌ను విక్రయించినట్టు తె లిపారు. వచ్చే సీజన్‌లో చెరకు రైతులకు త్వరితగతిన బకాయిలు చెల్ల్లించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే షుగర్ ఫ్యాక్టరీకి ఆదాయం పెరిగి, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని ఆయన తెలిపారు. దీనిపై ఇప్పటికే డీపీఆర్ తయారైందని. త్వరలో ప్రజాప్రతినిధుల సహకారంతో ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని ఆయన వెల్లడించారు.