పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా?.. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు రూ.4 కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దెల పేరుతో మరికొంత కొట్టేయటానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి జీవోలు జారీ చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్ పూర్తయితే మళ్లీ పది శాతం పెంచి సదరు కాంట్రాక్టర్‌కు కాంట్రాక్టు ఇవ్వాలి. రెండు కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు?. పైగా నాలుగు నెలల పాటు భక్తుల నుండి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారు’’ అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. ఒక కోటి రెండు లక్షలు భక్తుల నుంచి వసూలు చేసుకోమని జీవో ఇవ్వడం ఏంటి?. హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ ఆలయానికి రావటం వలన కాంట్రాక్టర్‌కు నష్టం వచ్చిందని జీవోలో రాశారు. ఇదేం విచిత్రమైన జీవోలు?. దోచుకో, దాచుకో, తినుకో అనే పరిస్థితి వస్తుందని వైఎస్ జగన్ ముందే చెప్పారు. అమ్మవారి ఆలయంలో భారీగా దోపిడీ చేస్తున్నారు. దోపిడీ చేసుకోమని అధికారికంగా జీవో ఇవ్వడం కూటమి ప్రభుత్వంలోనే చెల్లింది. రూ. 3.06 కోట్లు అమ్మవారి ఆలయానికి నష్టం వచ్చింది. ఆ మేరకు సదరు కాంట్రాక్టర్‌కి లాభం చేకూరింది’’ అని పోతిన మహేష్ దుయ్యబట్టారు.కనకదుర్గ నగర్‌లో షాపులు ఏర్పాటులోనూ అక్రమాలు చేశారు. బకాయిలు ఉన్నా, వ్యాపారాలు సజావుగా సాగుతున్నా 49 శాతం అద్దెలు తగ్గించారు. బుద్దా వెంకన్న ఒక్కో షాపుకు రూ.5 లక్షలు చొప్పున లంచాలు తీసుకున్నారు. మూడు నెలల్లో 4 కోట్లు వసూలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన మనుషులకి ఘాట్ రోడ్డులో కోటికి పైగా విలువైన కాంట్రాక్టును నామినేషన్ మీద ఇచ్చారు. అన్నదాన సత్రంలో స్టీల్ టేబుల్స్ ఏర్పాటు కాంట్రాక్టులోనూ అవినీతి పాల్పడ్డారు. అమ్మవారి సొమ్ము కొట్టేయటంలో ఏఈ లక్ష్మణ్.. బుద్దాకు సహకరిస్తున్నారు. వీటన్నిటిపై ఏసీబితో విచారణ జరిపించాలి. ఆధారాలతో సహా చర్చకు ఏ వేదిక మీదనైనా నేను సిద్ధం.. చట్టపరంగా పోరాటం చేస్తా. ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చేస్తున్న తప్పుడు పనులపై ఆధారాలు సేకరిస్తున్నాం. అమ్మవారి ఆలయంలో జరిగే అక్రమాలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.