ఇప్పటికే కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనతో నెలరోజులకు పైగా అట్టుడికిపోతున్న పశ్చిమ బెంగాల్‌లో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. రాజధాని కోల్‌కతాలో బాంబు పేలుడు ఘటన పెను సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఓ చెత్త ఏరుకునే వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సమచారం అందుకున్న బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఈ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అధికార టీఎంసీపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. దీదీ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. బాంబు పేలుడు ఘటనను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏకు అప్పగించి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
సెంట్రల్ కోల్‌కతాలోని బ్లాచ్‌మన్ స్ట్రీట్, ఎస్‌ఎన్ బెనర్జీ రోడ్ జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ బాంబు పేలుడు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ పేలుడు జరిగిన బ్లాచ్‌మన్ స్ట్రీట్ ఎంట్రెన్స్ వద్ద ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌ను స్థానికులు గుర్తించారు. ఆ బ్యాగులో నుంచే బాంబు పేలుడు జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న బాంబ్ డిటెక్షన్ టీమ్, డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం మొత్తం తనిఖీలు నిర్వహించింది. ఆ అనుమానాస్పద గన్నీ బ్యాగ్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాలను మొత్తం గాలింపు చేపట్టారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయగా.. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఇక ఈ ఘటనలో వీధుల్లో తిరిగి ప్లాస్టిక్ సామాన్లు ఏరుకుని జీవించే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి వేళ్లు సంఘటనా స్థలంలో తెగిపడినట్లు అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తిని 58 ఏళ్ల బాపి దాస్‌గా అధికారులు గుర్తించారు. బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన బాపి దాస్‌ను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు కారణం ఎవరో ఇప్పటివరకు తెలియరాలేదు. ఆ బాంబు పెట్టింది ఎవరూ అనేది ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన బెంగాల్‌లో తీవ్ర దుమారం రేపుతుండగా.. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోల్‌కతా నగరంలో పేలుడు సంభవించడం పెను దుమారానికి కారణం అయింది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ బీజేపీ నేత, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ తీవ్రంగా స్పందించారు. ఈ బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. బెంగాల్‌లో శాంతి భద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని కేంద్రమంత్రి విమర్శించారు. రాష్ట్ర హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న సీఎం మమతా బెనర్జీ.. పూర్తిగా విఫలం అయ్యారని.. వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కేంద్రమంత్రి సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు.