వాతావరణంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులను సమగ్రంగా, మరింత కచ్చితత్వంతో అధ్యయనం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే 5ఏళ్లలో మరింత కచ్చితత్వంతో వాతావరణ సమాచారాన్ని అందుకునేందుకు మిషన్ మౌసం అనే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్ మౌసంకు రూ.2000 కోట్ల బడ్జెట్‌కు కూడా అనుమతిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను గుర్తించడానికి.. వాటిని వేగంగా అందించడానికి ఈ మిషన్ మౌసం ప్రాజెక్టును చేపట్టింది.
వాతావరణాన్ని అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉన్న విధానాల వల్ల ఉష్ణమండల వాతావరణం ముందస్తుగా అంచనా వేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. పరిశీలనాత్మక సమాచారం విస్తృతంగా లేకపోవడం, న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్- ఎన్‌డబ్ల్యూపీ పరిధి 12 కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయడం వాతావరణ శాఖకు పెను సవాలుగా మారింది. భారీ వర్షాలతో వరదలు, కరువు, క్లౌడ్ బరస్ట్, ఉరుములు, పిడుగులు, కుంభవృష్టి వానలను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే వాతావరణ మార్పులను అత్యంత కచ్చితంగా, వేగంగా అంచనా వేసేందుకు కొత్త శాటిలైట్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న వెదర్ రాడార్లను భారీగా పెంచడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం, మెరుపు వేగంతో పనిచేసే సూపర్ కంప్యూటర్లతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. మరీ ముఖ్యంగా న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్-ఎన్‌డబ్ల్యూపీ పరిధిని ప్రస్తుతం ఉన్న 12 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేయనుంది.
ఈ మిషన్ మౌసంను వచ్చే ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువచ్చి.. కచ్చితమైన వాతావరణ అంచనాలను వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ మౌసంను మొత్తం 2 దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో భాగంగా 2026 మార్చి వరకు పరిశీలనాత్మక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో దాదాపు 70 డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు, 10 విండ్ ప్రొఫైలర్లు, 10 రేడియోమీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు 39 డాప్లర్ రాడార్లను ఐఎండీ ఏర్పాటు చేసినా.. విండ్ ప్రొఫైలర్లు మాత్రం అందుబాటులో లేవు.
ఇక రెండో దశలో పరిశీలనాత్మక కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు శాటిలైట్లు, విమానాలను ఉపయోగించనున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ.. మేఘాల్లో జరిగే ప్రక్రియలపై అధ్యయనం కోసం మహారాష్ట్ర పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటియెరాలజీలో క్లౌడ్ ఛాంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాదిన్నరలో ఈ క్లౌడ్ ఛాంబర్‌ను పూర్తి చేయనున్నారు.
మధ్యస్థ శ్రేణి వాతావరణ అంచనాల కచ్చితత్వాన్ని 5 నుంచి 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్ మౌసంను కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు కచ్చితమైన వాతావరణ అంచనాలను చేరవేయనున్నారు. ప్రస్తుతం ఉన్న వెదర్ ఫోర్‌కాస్ట్ (ముందస్తు వాతావరణ అంచనాలు) స్థానంలో వెదర్ నౌకాస్ట్ (తక్షణ వాతావరణ అంచనాలు) వ్యవస్థను ఈ మిషన్ మౌసంలో భాగంగా వచ్చే 5ఏళ్లలో అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం నౌకాస్ట్‌ను వాతావరణ అంచనాలను 3 గంటల ముందు ఇస్తుండగా.. దాన్ని ఒక గంటకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.