ప్రపంచంలోనే ఏడు అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి ఒక ఆందోళనకరమైన వార్త బయటికి వచ్చింది. ఆగ్రాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. తాజ్ మహల్‌లో లీకేజీలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. తాజ్ మహల్ మెయిన్ డోమ్ వద్ద వర్షపు నీరు లీక్ అయినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో చర్యలు చేపట్టారమని.. డ్రోన్ కెమెరా సాయంతో మెయిన్ డోమ్ మొత్తం తనిఖీలు నిర్వహించినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ లీకేజీ కారణంగా ప్రధాన గోపురానికి ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగానే తాజ్ మహల్ వద్ద నీరు లీక్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నంగా ప్రపంచ అద్భుతంగా కీర్తికెక్కింది. అయితే ఇప్పుడు ఈ తాజ్ మహల్‌కు లీకేజీలు ఉన్నట్లు బయటపడటంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తాజ్ మహల్.. ఇప్పుడు లీకులు రావడం.. తాజ్ లవర్స్‌లో కలవరం మొదలైంది.
ఈ నేపథ్యంలోనే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రంగంలోకి దిగారు. తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి వర్షం నీరు లీక్ కావడాన్ని తాము గమనించామని ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. నీటి లీకేజీ జరిగినా.. ప్రధాన గోపురానికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే డ్రోన్ కెమెరాను ఉపయోగించి తాజ్ మహల్ మెయిన్ డోమ్ మొత్తం తనిఖీ చేశామని వెల్లడించారు. ఇక ప్రధాన గోపురంలో నీటి లీకేజీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు.
మరోవైపు.. ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ పరిధిలో కురుస్తున్న భారీ వానలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. భారీ వరదలతో నిండిన తాజ్ మహల్ తోట మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే తాజ్ మహల్ రక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. ఇక గురువారం ఆగ్రాలో 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 80 ఏళ్లలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆగ్రాలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.