ఇటీవల కాలంలో తినే ఆహార పదార్థాలు, తాగే పానీయాలు కల్తీ చేస్తున్న ఘటనలు మనకు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. అయితే ఇవి తింటే, తాగితే ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో శుభ్రత లేకపోవడం, కల్తీలు జరుగుతున్న ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక కొన్ని ఆహార పదార్థాలు, ప్యాకేజింగ్ ఫుడ్ ఐటెమ్స్ తయారీకి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వాటిని తినాలంటేనే వాంతి వచ్చినంత పని అవుతోంది. కానీ తాజాగా ఫ్రూట్ జ్యూస్‌ను కల్తీ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. అది కూడా ఆ ఫ్రూట్ జ్యూస్‌లో మనుషుల మూత్రం పోసి అమ్ముతున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఫ్రూట్ జ్యూస్‌లో మూత్రాన్ని కలిపి అమ్ముతున్న షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. ఘాజియాబాద్ పట్టణంలో అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఖుషీ జ్యూస్ కార్నర్ అనే పేరుతో ఫ్రూట్ జ్యూస్ విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ తయారు చేసే జ్యూస్‌లో మూత్రం కలిపి.. కస్టమర్లకు అమ్ముతున్నారు. అయితే ఆ జ్యూస్ తాగిన కొందరు కస్టమర్లకు అందులో ఏదో కలిపారు అనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తనిఖీలు చేయగా.. మూత్రం డబ్బా కనిపించింది. దీంతో అనుమానం వచ్చి అమీర్ ఖాన్ అతని షాప్‌లో పనిచేసే ఓ మైనర్ బాలుడిని చితకబాది ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించారు.
ఇక ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ జ్యూస్ సెంటర్‌లో ఉన్న మూత్రం డబ్బాను తనిఖీ చేశారు. అమీర్ ఖాన్ అతడి సహాయకుడిపై స్థానికులు దాడి చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అమీర్ ఖాన్, బాలుడు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. అయితే మూత్రం పోయడానికి షాప్‌లో బాత్రూ లేదని.. పరిసరాల్లో కూడా ఎలాంటి ఖాళీ ప్రదేశం లేదని పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మూత్రాన్ని అలా డబ్బాలో పోసినట్లు వివరించారని సమాచారం. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.