ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం తనిఖీల తర్వాత గుర్తించిన అవకతవకలపై విజిలెన్స్ విభాగం సరిగా స్పందించలేదని కాగ్ తప్పుపట్టింది. 2021-22లో ఉపాధి పథకంలో రూ.232 కోట్ల మేర తేడాలొచ్చినట్టు తేలింది. మండల సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్లో కూడా రూ.89 కోట్లు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లాయని నిర్ధారణ అయింది. అయితే 2023 ఆగస్టు వరకు ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదని అధికారులు పేర్కొన్నట్లు స్థానిక సంస్థలకు సంబంధించి కాగ్ ఆడిట్ నివేదికలో వెల్లడించింది. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి నియంత్రణ చేయాల్సిన సంస్థలు ఎలా నిర్వీర్యం అయ్యాయో కాగ్ నివేదికతో వెల్లడైంది.
మరోవైపు పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై 2018లో రాష్ట్ర విధానం రూపొందించారు. మొత్తం 17 పట్టణ స్థానిక సంస్థలను పరిశీలిస్తే, 2022 డిసెంబరు నాటికి అందులో కేవలం ఐదింటికి మాత్రమే విధివిధానాలు రూపొందించారని కాగ్ పేర్కొంది. ఐదు పట్టణాల్లో మాత్రమే ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందాయని తెలిపింది. ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్ల కార్యకలాపాల కోసం 2022 నవంబరు వరకు రాష్ట్ర వాటా కింద రూ.42.53 కోట్లను ఆయా పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు.