ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి కువైట్, మస్కట్, సౌదీ వెళ్లి మోసపోయి.. దేశం కాని దేశంలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, ఉపాధికోసం దుబాయ్‌కు వెళ్లి.. అక్కడ నరకయాతన అనుభవిస్తోన్న అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత అనే బాధితురాలిని ఏపీ ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఆమె పరిస్థితి గురించి ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే స్పందించింది. వివరాల్లోకి వెళ్తే.. తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. పని ప్రదేశంలో ఆమె ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చింది.
ఆమెను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను రాంప్రసాద్ రెడ్డి కోరారు. దీంతో ఏపీ ఎన్నార్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్‌లోని సామాజిక కార్యకర్త జిలకర మురళి, షేక్ రసీదా బేగం సహాయ సహకారాలతో కవిత ఆమె స్వగ్రామానికి చేరుకుంది. కువైట్ నుంచి ఎయిరిండియా విమానంలో కవిత శనివారం ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడి నుంచి సాయంత్రం తన స్వగ్రామం నారాయణరెడ్డి పల్లి చేరుకుంది.
ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవిత.. తాను పనిచేసే చోట తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో ద్వారా వివరించింది. అక్కడ నుంచి బయటపడి దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందింది. ఈ వీడియో వైరల్ కాగా.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. బాధితురాలి వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అందజేసి... కవితను స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాలని లేఖ రాశారు.
తన కార్యాలయానికి శుక్రవారం ఉదయం సమాచారం అందిన వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఏపీ ఎన్నార్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఏపీ ఎన్నార్టీ విభాగం బాధితురాలిని 12 గంటల్లోపే స్వదేశానికి తీసుకొచ్చింది. కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు ఎడారిలో తమ వ్యతలను వివరిస్తూ రక్షించాలని వేడుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.