ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలోని నదులు గంగా, శారదా, గాగ్రా తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి పొంగి ప్రవహిస్తున్నాయి.ఈ వర్షాల కారణంగా శనివారం మీరట్‌లోని మూడంతస్తుల భవనం కుప్ప కూలిన ఘటనలో 10 మంది మరణించారు. సహయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా వివరించారు.అలాగే వివిధ ప్రాంతాల్లో నీట మునిగి మరో నలుగురు మృతి చెందారని తెలిపారు. ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.ఇక బుదాన్‌లో గంగా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది. అరియాతోపాటు పలు ప్రాంతాల్లో యమున నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. అలాగే లక్ష్మీపూర్ ఖేర్‌లో శరదా నది, బారాబంకితోపాటు అయోధ్యలో గాగ్రా నది పరవళ్లు తొక్కుతూ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుందని విపత్తు నిర్వహణ కమిషనర్ తన నివేదికలో స్పష్టం చేశారు. గత 24 గంటల్లో 2.2 మి. మీ. వర్షపాతం నమోదయిందని విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం పేర్కొంది.ఇక గంగ, యమునా నదులకు వరద పోటెత్తడంతో.. ప్రయాగ్ రాజ్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. అలాగే నగరంలోని పలు కాలనీలు సైతం నీటి మునిగాయి. జిల్లాలోని 15 ప్రాంతాలు వరద తాకిడికి గురయ్యాయని ఉన్నతాధికారులు వివరించారు. దీంతో నిరాశ్రయులైన వందలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు స్పష్టం చేశారు.