చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని.. వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అధికారుల చేత నటి జెత్వానీని అరెస్టు చేయించిన సజ్జలను అరెస్ట్ చేయాలన్నారు. ట్రిబ్యునల్‌కు వెళ్తామనటం సమర్థనీయం కాదన్నారు. ముగ్గురిని వైసీపీలో చేర్చుకొని జిల్లా అధ్యక్షులుగా చేయాలని.. లేదంటే జగన్ సెక్యూరిటీ అధికారులుగా నియమించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి లేఖ రాసి ముగ్గురుని ఐపీఎస్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.