శివసేన (ఏకనాథ్ వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుక కోసినవారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థను ముగించాలనుకుంటున్నట్లు విదేశాలలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చెప్పారని, ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్న సమయంలో రిజర్వేషన్లను ముగిస్తానంటూ మాట్లాడారని, రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని చూపారని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాలుకను కోస్తే ఎవరికైనా తాను రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తానని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజలకు అతి పెద్ద ద్రోహం చేయడమేనని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.గైక్వాడ్ వ్యాఖ్యలపై మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన మిత్రపక్షమైన బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలను తాను సమర్థించబోనని, ఆమోదించబోనని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు. సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది. సంజయ్ గైక్వాడ్‌కు సమాజంలో, రాజకీయాల్లో జీవించే అర్హత లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే అన్నారు. కాగా సంజయ్ గైక్వాడ్ కు వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.