ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబు నాయుడు విధానాలపైనా రోజుకో అంశంపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా మరోసారి సుదీర్ఘ పోస్టు పెట్టారు. ప్రభుత్వ స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తీసుకుంటున్న తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆరోపించారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సర్కారీ బడుల్లో చదివే పిల్లలు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి అంటూ జగన్ ట్వీట్ చేశారు.
" గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది.నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ వైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యా కానుక, రోజుకో మెనూతో గోరుముద్ద.. ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు" అంటూ జగన్ ట్వీట్ చేశారు.
" మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కోర్టులకువెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు." అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్ల చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఎందులోనూ తక్కువ కాదన్న వైఎస్ జగన్.. లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణ కూడా తీసుకుని ఉంటారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్పచదువులు చదువుకుని.. విద్యార్థులకు చక్కగా చదువులు చెప్తారని అభిప్రాయపడ్డారు. అలాంటివారిని తక్కువగా చూసే మనస్తత్వాన్ని మార్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. చదువు పేదరికాన్ని నిర్మూలించే ఆయుధమని అభివర్ణించిన జగన్.. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులను మానుకోవాలని హితవు పలికారు. లేదంటే చరిత్రహీనులుగా, పేద ప్రజల వ్యతిరేకులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.