ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది.. ఈమేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు కావడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించింది. గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో ఒకేసారి ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్ని సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఆ ఊరిలో ప్రజలంతా పాల్గొని.. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అయ్యింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన నరసాపురం మున్సిపాలిటీ డంపింగ్ యార్డు సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషకరం. డంపింగ్ యార్డుకు అవసరం అయిన భూమి కోసం రూ.1.74 కోట్లను అత్యవసర నిధుల కింద రెండు రోజుల్లోనే ప్రభుత్వం విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనం. సత్వరమే స్పందించి నిధులు మంజూరు చేసినందుకు గౌవర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'అన్నారు.
'దశాబ్దాలుగా నరసాపురం మున్సిపాలిటీకి సరైన డంపింగ్ యార్డు లేకపోవడం మూలంగా సేకరించిన చెత్తను గోదావరి గట్టునే పోయడంతో నదీజలాలు కలుషితం అవుతున్నాయి. ప్రజలు ఆ నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు. నరసాపురం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అతి తక్కువ రోజుల్లోనే డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపడం అభినందనీయం. డంపింగ్ యార్డును వెంటనే మరో చోటకు తరలించి, గోదావరి తీరాన్ని 2027 పుష్కరాల నాటికీ రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా సుందరీకరణ చేయాలని కోరుతున్నాను. నరసాపురం మున్సిపాలిటీ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్, పురపాలకశాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్, పురపాలక శాఖ కమిషనర్, డైరక్టెర్ శ్రీ హరినారాయణ్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు శ్రీమతి నాగరాణి, నరసాపురం ఆర్.డి.ఓ డా. అంబరీష్ గార్లకు, అదే విధంగా అధికారులతో, శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తూ పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను'అంటూ ట్వీట్ చేశారు.