డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ పేలుడు కలకలంరేపింది. పట్టణంలోని రావులచెరువు ప్రాంతంలో ఓ ఇంట్లో పేలుడు దెబ్బకు ఇల్లు నేలమట్టమైంది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారందరిని స్థానికులు, పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ పేలుడు గ్యాస్ సిలిండర్ వల్లే జరిగిందని ముందు ప్రచారం జరగ్గా.. స్థానికులు మాత్రం బాణాసంచా వల్ల జరిగిందని చెబుతున్నారు. దీపావళి పండగ కోసం జనావాసాల మధ్య రహస్యంగా బాణాసంచా తయారు చేస్తుండగానే ఈ ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం దెబ్బకు రెండతస్తుల భవనం భారీ శబ్ధంతో కుప్పకూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సంఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని.. వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేలుడు మందుగుండు సామాగ్రి వల్లే జరిగిందా అని ఆయన్ని అడగ్గా.. అవన్నీ విచారణలో తేలుతామని.. సరైన సమాచారం లేకుండా దానిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమలాపురం పట్టణం ఈ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.