ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్మూజ్ నుంచి ఆఫ్రికాకు బయలుదేరిన భారతీయ ట్యాంకర్

national |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 08:11 PM

హర్మూజ్ జలసంధి నుంచి భారతీయ ఆయిల్ ట్యాంకర్ జగ్ ప్రకాశ్ ఆఫ్రికాకు బయలుదేరినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం తెలిపారు. ఒమన్‌లోని సోహార్ పోర్టు నుంచి ఆఫ్రికా దేశం టాంజానియాలోని టాంగా పోర్టుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లోసుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకోవడంతో రెండు వారాలుగా రవాణా స్తంభించిపోయింది. ఇటీవల భారత్‌లోని కాండ్లా రేవుకు వస్తున్న థాయ్‌లాండ్ నౌక మయూరీ నారీ బ్యాంకాంక్‌‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే.


కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హర్మూజ్ జల సంధికి తూర్పున ఒమన్‌వైపు నాలుగు భారతీయ నౌకలు చిక్కుకున్నాయని, అందులో జగ్ ప్రకాశ్ ఒకటి అన్నారు. ప్రస్తుతం జగ్ ప్రకాశ్ ప్రయాణం మొదలుపెట్టిందని తెలిపారు. మరో మూడు నౌకలు అక్కడ ఉన్నాయని, అందులో 76 మంది నావికులు ఉన్నారని సిన్హా వెల్లడించారు. అలాగే, జల సంధికి పశ్చిమాన పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ నౌకలు నిలిచిపోయాయని, అందులో 677 మంది భారతీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.


నౌకల రవాణాను ట్రాక్ చేసే కెప్లర్ డేటా ప్రకారం.. ఒమన్ సోహర్ ఓడ రేవు నుంచి టాంజానియాలో టాంగా పోర్టుకు మార్చి 21 నాటికి చేరుతుంది. కొన్ని దేశాల నౌకలను హర్మూజ్ జల సంధి నుంచి అనుమతిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి మజీద్ తఖ్తట్-రవంచి గురువారం వెల్లడించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జల సంధిలో దాదాపు 20 నౌకలపై దాడి చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి.


యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ), ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) ఇరాన్ అధికారుల డేటా ప్రకారం.. యుద్ధం మొదలైన నాటి నుంచి మార్చి 11 మధ్యాహ్నం వరకు కనీసం 10 చమురు ట్యాంకర్లను ఢీకొట్టడం, లక్ష్యంగా చేసుకోవడం లేదా దాడులు జరిగినట్లు నివేదించాయి.


తన భూభాగంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించాలనే ఇరాన్ తపన.. చమురు రవాణాకు అత్యంత కీలకమైన జలసంధిని దాదాపు మూసివేసింది. ఇందులో నుంచి అతి కొద్ది నౌకలు మాత్రమే ప్రయాణించగా.. మరికొన్ని దాడుల్లో చిక్కుకున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు అయతుల్లా మోజ్తాబా ఖమేనీ తన తొలి ప్రకటనలో అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా పోరాడుతామని, హర్మూజ్‌ను మూసివేస్తామని ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa