ఉద్యోగినులు, విద్యార్థినులకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి చట్టం అమలు చేస్తే మహిళలను ఉద్యోగాల్లో నియమించేందుకు సంస్థలు వెనుకంజ వేయవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే యువతులు ఇతర ఉద్యోగులతో తాము సమానంగా లేమనే భావన కలగవచ్చని, ఇది వారి కెరీర్ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.భారతీయ సమాజంలో నెలసరి సెలవుల అంశంపై చాలా కాలంగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. కొందరు న్యాయమూర్తుల అభిప్రాయాలను సమర్థిస్తుంటే, మరికొందరు నెలసరి సమయంలో ఒకటి లేదా రెండు రోజుల సెలవు ఇవ్వడం మహిళలకు ఉపశమనంగా ఉంటుందని అంటున్నారు.ఇటీవలి సంవత్సరాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే ప్రముఖ ప్రైవేటు సంస్థలు కూడా తమ మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను అమలు చేస్తున్నాయి.
*కెరీర్ పురోగతిపై ప్రభావం : దేశవ్యాప్తంగా నెలసరి సెలవుల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసినట్టు లీగల్ వెబ్‌సైట్ లైవ్ లా పేర్కొంది.తర్వాత త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ, నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రెండు లేదా మూడు రోజుల సెలవు ఇవ్వాలని తాను కోరినట్టు చెప్పారు.అయితే న్యాయమూర్తుల అభిప్రాయం ప్రకారం అలాంటి విధానం మహిళలకు పెద్దగా ప్రయోజనం కలిగించకపోవచ్చు. పైగా ఇది లింగ సంబంధిత మూసధోరణులను మరింత బలపరిచి మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అన్నారు.ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేటు కంపెనీలు మహిళలను నియమించడంలో సంకోచించవచ్చని, దాంతో మహిళల నియామకాలు తగ్గే ప్రమాదం ఉందని కూడా కోర్టు సూచించింది.అయితే ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నెలసరి సెలవుల విధానంపై నిర్ణయం తీసుకోవచ్చని న్యాయమూర్తులు పేర్కొన్నట్టు లైవ్ లా వెల్లడించింది.కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్స్ సమయంలో సెలవు ఇవ్వడం మహిళల పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని అంటున్నారు.
*“మహిళల హక్కులను తిరస్కరించడం” : సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో నెలసరి సెలవుల అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దీనిని పురోగామి చర్యగా చూడాలా? లేక మహిళలు బలహీనులని సూచించే విధంగా ఉందా? అనే ప్రశ్నలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రజా ఆరోగ్య నిపుణురాలు, న్యాయవాది సుకృతి చౌహాన్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు నెలసరి అంశంపై సమాజంలో ఉన్న నిషేధ భావనను, మహిళల హక్కులపై సరైన చర్చ ఇంకా జరగలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయని అన్నారు.భారత్‌లో పని ప్రదేశాల్లో గౌరవం, లింగ సమానత్వం, సురక్షిత వాతావరణం గురించి చట్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు. నెలసరి సెలవులను నిరాకరించడం వల్ల మహిళలు అసౌకర్యకరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి రావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.అదే సమయంలో పీరియడ్స్ సెలవు ఇవ్వడం వల్ల మహిళల ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగుపడటంతో పాటు పనితీరు కూడా పెరుగుతుందని ఆమె చెప్పారు.
*కొన్ని రాష్ట్రాల్లో అమలు :మహిళలకు అదనపు సెలవులు ఇవ్వడం పురుషులపై వివక్షగా భావించవచ్చని కొందరు వాదిస్తున్నారు. మరోవైపు రుతుక్రమం సమయంలో మహిళలపై ఉన్న సామాజిక నిషేధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పలువురు సూచిస్తున్నారు.స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే పీరియడ్స్ సెలవుల విధానాన్ని అమలు చేస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం ఇది మహిళలకు ప్రయోజనకరంగా ఉందని ఈ విధానాన్ని మద్దతు ఇస్తున్నవారు చెబుతున్నారు.భారత్‌లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలకు రెండు రోజుల సెలవు ఇస్తున్నాయి. కేరళలో యూనివర్శిటీలు మరియు పారిశ్రామిక శిక్షణా సంస్థల మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యం ఉంది.కర్ణాటక ప్రభుత్వం నెలకు ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా ఆమోదించింది.ఇటీవల కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆర్‌పీజీ గ్రూప్‌కు చెందిన సీఈఏటీ కంపెనీ నెలకు రెండు రోజుల సెలవు ప్రకటించగా, ఎల్ అండ్ టీ నెలకు ఒక రోజు సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అయితే మహిళా ఉద్యోగులకు ఏడాదికి పది రోజుల పీరియడ్స్ సెలవును అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa