ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ దేశంలో మోదీ పర్యటించనున్నారు. క్వాడ్ లీడర్స్ సదస్సుకు హాజరు కానున్నారు. అంతేకాకుండా ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అనంతరం వివిధ దేశాల నేతలతో కూడా సమావేశం కానున్నారు. కొన్ని రంగాల్లో భారత్ కోసం వివిధ సంస్థల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.
ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్‌లో జరగనున్న నాలుగో క్వాడ్ సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. అయితే క్వాడ్ సదస్సును ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే అమెరికా చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహించేందుకు భారత్ అంగీకరించింది. ఈ క్వాడ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో కూడా పాల్గొని ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే డెలావేర్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. క్వాడ్ నాయకులు.. క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షించడానికి, భవిష్యత్తు ఎజెండాను రూపొందించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను అందుకోవడంలో సహాయం చేయడానికి వచ్చే ఏడాదికి సంబంధించిన ఎజెండాను కూడా ఇదే క్వాడ్ సమావేశంలో నిర్దేశించనున్నారు.
ఈ క్వాడ్ సదస్సు సందర్భంగానే పలువురు ప్రపంచ నేతలతో కలిసి ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే సమయంలో సెప్టెంబరు 22వ తేదీన న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయో టెక్నాలజీ, సెమీ కండక్టర్లు సహా ఇతర రంగాల్లో భారత్‌తో సహకారాన్ని పెంపొందించేందుకు గాను అమెరికాలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. భారత్- అమెరికా సంబంధాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ మోదీ మాట్లాడనున్నారు.