ఏపీలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు వరద బాధితుల కోసం విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రంగాలకు అతీతంగా ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ విరాళాలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపార సంస్థ అమరరాజా గ్రూపు కూడా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం విరాళాలు అందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల చొప్పున విరాళం అందించింది. అమరరాజా గ్రూపు కో ఫౌండర్ గల్లా అరుణకుమారి ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు విరాళాలకు సంబంధించి చెక్కులు అందజేశారు.
మరోవైపు వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ఇబ్బందులు పడ్డారని మాజీ ఎంపీ, అమరరాజా గ్రూపు ఛైర్మన్ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. లెక్కలేనని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని.. చాలా మంది జీవనోపాధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రజలను ఆదుకోవడం తమ కర్తవ్యంగా.. ఈ కష్టసమయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందులో భాగంగానే విరాళాలు అందజేసామన్న గల్లా జయదేవ్.. తమ సాయం వరదల బాధితులకు పునరావాసం, సహాయక చర్యల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం సినిమా నటుల నుంచి రాజకీయ నేతలు, వ్యాపార వేత్తల వరకూ ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తమకు తోచిన రీతిలో సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఏపీలో వరద బాధితుల కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు, వాహనాలకు, పంటలకు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఉంటామని.. వారికి అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద బాధితులకు ఇంటికి రూ.25 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.