మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఐదేళ్లలో మహారాష్ట్రలో జరిగినన్ని పొలిటికల్ ట్విస్ట్‌లు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోయి.. బీజేపీతో చేరి అధికారాన్ని చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే షిండే శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి కాగా.. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ మహారాష్ట్రలోని పలువురు నేతలు.. తమకు సీఎం కావాలని ఉందని ఆకాంక్షలను వినిపిస్తున్నారు. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న అజిత్ పవార్.. తన మౌనం వీడి స్పందించారు. తనకు సీఎం కావాలని ఉందంటూ తన ఇష్టాన్ని బయటపెట్టారు.
సీఎం పదవిపై స్పందించిన అజిత్ పవార్.. ప్రతీ ఒక్కరు తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని పేర్కొన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే.. వారు మెజార్టీ సీట్లు దక్కించుకోవాలన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేరవని.. ప్రతి ఒక్కరు వారు కోరుకున్నది పొందలేరని.. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలి అనుకునేవారు మహారాష్ట్రలో ఉన్న 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుందని అజిత్ పవార్ తన మనసులో మాట బయటపెట్టారు. దగ్డూషేఠ్ హల్ద్వాయ్ గణపతి ఆలయంలో పూజల తర్వాత అజిత్ పవార్ ఈ విధంగా స్పందించారు.
ఇక త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, ఎన్‌సీపీ, శివసేన నేతృత్వంలోని కూటమి.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎదుర్కోనుందని అజిత్ పవార్ వెల్లడించారు. తన కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 3 పార్టీలు కలిసి చర్చించుకుని కొత్త సీఎంను ఎన్నుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తున్న వేళ.. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక దేవేంద్ర ఫడ్నవీస్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.