యాంకర్, వైసీపీ నేత శ్యామల రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు పిల్లికి బిచ్చం పెట్టరని, అలాంటివాళ్లు వైఎస్ జగన్‌ను విమర్శించడమేంటని శ్యామల ప్రశ్నించారు.దీనిపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ .. యాంకర్ శ్యామల రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ ప్రక్షాళనను ప్రారంభించారు వైసీపీ అధినేత జగన్. దీనిలో భాగంగా పార్టీతో పాటు అనుబంధ సంఘాల కమిటీలలో మార్పులు చేశారు. ఈ క్రమంలోనే రోజా, జూపూడి ప్రభాకర్, భూమన కరుణాకర్ రెడ్డి, శ్యామల రెడ్డిలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వెంటనే డ్యూటీ ఎక్కేసిన శ్యామల.. ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో చంద్రబాబు, నారా లోకేష్‌లపై సంచలన ఆరోపణలు చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రతీకార దాడులు జరిగాయని.. అలాంటి బాధితులకు జగన్ నష్టపరిహారం అందించారని శ్యామల రెడ్డి చెప్పారు. విజయవాడ వరద బాధితులను పరామర్శించడంతో పాటు రూ.కోటి ఆర్ధిక సాయంతో పాటు నేటికీ నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు చెప్పారు. 2 ఎకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు నేడు రూ.2 లక్షల కోట్ల స్థాయికి ఎదిగారని శ్యామల ఆరోపించారు.
ఆమె వ్యాఖ్యలపై జబర్దస్త్ కిరాక్ ఆర్పీ ఘాటుగా బదులిచ్చారు. శ్యామలకు జగన్ వైసీపీ అధికార ప్రతినిధి పదవిని ఇవ్వగానే ఆమెకు ముందు వెనుకా ఏమీ కనిపించడం లేదని మండిపడ్డారు. పదవికి, డబ్బులకు అమ్ముడుపోయి చిల్లర శ్యామల దిగజారిపోయిందని ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య 72 శాతం పోలవరం పనులు పూర్తి చేసింది.. 1998లో సైబర్ టవర్స్ నిర్మించింది, విజన్ 2020తో హైదరాబాద్ సింగపూర్‌గా మారింది, ఆదివాసీలకు ఫీడర్ అంబులెన్స్‌లు, ముషీరాబాద్ జైలుని గాంధీ ఆసుపత్రిగా మార్చింది ఎవరని ఆర్పీ ప్రశ్నించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12,977 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి శ్రీకారం చుట్టింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. కరణం మల్లేశ్వరి, పీవీ సింధులకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చింది, 2013లో ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగువారు చిక్కుకుపోతే వారిని ఆదుకుంది చంద్రబాబు కాదా అని ఆర్పీ ప్రశ్నించారు. అప్పులు కూరుకుపోయినప్పటికీ ప్రతినెలా 1వ తేదీ ఠంచనుగా పించన్ ఇస్తున్నారని, అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతి నెల 30 లక్షల మంది ఆకలి తీరుస్తున్నారని చెప్పారు.పేద వధువులకు ఆర్ధిక సాయం, పండుగ కానుకలు, విద్యుత్ మిగులు, 74 ఏళ్ల వయసులో మోకాలి లోతు నీటిలో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పించింది చంద్రబాబేనని ఆర్పీ వెల్లడించారు. బిల్‌గేట్స్, సత్యనాదెళ్ల వంటి దిగ్గజాల ప్రశంసలు పొందింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ అబద్ధాలని నిరూపించాలని.. దమ్ముంటే తనతో డిబేట్‌కు రావాలని, ఆమె వీడియో కోసం తాను వెయిట్ చేస్తుంటానని ఆర్పీ సవాల్ విసిరారు.