ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుల భరోసా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందితో చర్చించామన్నారు. ముందస్తుగా లారీలను, గన్ని బ్యాగులకు ఇబ్బందులు లేకుండా సిద్ధం చేశామన్నారు మంత్రి నాదెండ్ల. ప్రతి వాహనానికి జీపీఎస్ అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు నాదెండ్ల.
మరోవైపు ప్రభుత్వం వంద రోజుల పాలనపై జగన్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల. నిజంగా జగన్‌మోహన్‌రెడ్డికి నిజాయితీ ఉంటే రబీ పంటను కొనుగోలు చేసి 1674 కోట్లు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 30రోజుల్లో రైతులకు చెల్లించాల్సిన 1674 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమచేశామన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్నిమూడు నాలుగు రోజుల్లో అందిస్తామన్నారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఏమాత్రం తగ్గకుండా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కష్టపడుతున్నామన్నారు మంత్రి.