మనం నిత్యం రోడ్లపై ఎన్నో రకాల యాక్సిడెంట్‌లను చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా ప్రాణాలు పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా కొందరు మాత్రం రోడ్లపై నిర్లక్ష్యంగానే వాహనాలు నడుపుతూ వాళ్ల ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఇలాంటి యాక్సిడెంట్లకు సంబంధించి ఎన్ని వీడియోలు వచ్చినా కొందర్లో కొంత కూడా చలనం రావట్లేదు. తాజాగా రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు.. బైకర్ ప్రాణాలు తీసింది. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు వెనక ఉన్న మరో బైకర్ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఈనెల 15వ తేదీన తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ యువకుడు బైక్‌పై అతివేగంగా వెళ్తుండగా.. ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన ఎస్‌యూవీ కారును ఢీకొట్టాడు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున 5.45 గంటలకు గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ ఎస్‌యూవీ కారు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తోంది. అయితే అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న బైకర్ వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. అయితే ఆ బైకర్ అన్ని సేఫ్టీ ప్రమాణాలు పాటించినా ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయాడు. హెల్మెట్, గ్లౌజులు, సేఫ్టీ గేర్ ధరించినా.. ప్రమాదం ధాటికి ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే తోటి వాహనదారులు అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ తీవ్ర గాయాలు అయిన ఆ యువ బైకర్ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. ఆ బైకర్‌ను ఢిల్లీ ద్వారకలోని పోచన్‌పూర్‌లో నివాసం ఉండే 23 ఏళ్ల అక్షత్ గార్గ్‌గా గుర్తించారు. ఇక అక్షత్ గార్గ్ ఫ్రెండ్.. 22 ఏళ్ల ప్రద్యుమన్ కుమార్ కూడా అదే రోడ్డుపై మరో బైక్‌పై వెళ్తుండగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అతడి గో ప్రో కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి కాస్తా బయటికి రావడంతో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణం అయిన కారును నడుపుతున్న కుల్దీప్ కుమార్ ఠాకూర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఘిటోర్ని ప్రాంతంలో నివసిస్తాడని.. పీఆర్ కంపెనీ కో ఫౌండర్ అని పోలీసులు వెల్లడించారు. అయితే కుల్దీప్ కుమార్ ఠాకూర్ అరెస్ట్ అయినా.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఈ వీడియో చూస్తే స్పష్టం అవుతోంది.