గత కొన్నేళ్లుగా భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వందే భారత్, వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్ రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలపైకి ఎక్కి ప్రయాణికులకు సౌకర్యవంతమైందే కాకుండా వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేయడం, అలాంటి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లోనే దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇక ఈ బుల్లెట్ రైలు ప్రయాణించేందుకు ముంబై-అహ్మదాబాద్ మధ్య రైల్వే కారిడార్‌ను కూడా శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశ తొలి హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధం అయింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారత తొలి హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బుల్లెట్ రైలు తయరీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సెప్టెంబర్ 5వ తేదీన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ.. హైస్పీడ్ ఛైర్‌కార్ ట్రైన్ తయారీకి సంబంధించిన టెండర్‌ను విడుదల చేసింది. ఈ బుల్లెట్ రైళ్లను గంటకు 280 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లేలా తయారు చేయాలని పేర్కొంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ తయారీ టెండర్లకు సంబంధించి బిడ్ల దాఖలకు సెప్టెంబర్ 19వ తేదీతో గడువు పూర్తి అయింది.
అయితే ఈ బుల్లెట్ ట్రైన్‌ను తయారు చేసేందుకు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్-బీఈఎంల్ మాత్రమే కొటేషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఈ టెండర్ల ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యు.సుబ్బారావ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇక బీఈఎంల్ కేంద్రంలో తయారు కానున్న ఈ బుల్లెట్ రైలుకు రెండున్నరేళ్ల గడువు ఉండనుంది. మరోవైపు.. దేశంలో నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు మార్గం అయిన ముంబై-అహ్మదాబాద్ రైల్వే కారిడార్‌లో ఈ మొట్టమొదటి హైస్పీడ్ రైలును నడపనున్నారు.
అయితే ఈ బుల్లెల్ట్ రైలు అసలు ధరను ఇప్పటివరకు బయటికి చెప్పకపోయినా.. దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల మధ్యలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య దాదాపు 508 కిలోమీటర్ల మార్గంలో సిద్ధమైన హైస్పీడ్ కారిడార్‌లో ఈ రైలును పట్టాలెక్కించనున్నారు. ఈ ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును దాదాపు రూ.1.1 లక్షల కోట్లతో నిర్మించనున్నారు.
నిజానికి ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో జపాన్‌లో తయారైన బుల్లెట్ రైలును నడపాలని మొదట అధికారులు భావించారు. కానీ.. జపాన్ రైలు కొనుగోలు, దాని నిర్మాణ వ్యయం భారీగా ఉండటంతో సొంతంగానే తయారు చేయాలని నిర్ణయించారు. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం బీఈఎంల్, మేధా సెర్వో డ్రైవ్స్ కలిసి పని చేయనున్నాయి. ఐరోపా ప్రమాణాలకు అనుగుణంగా ఈ సరికొత్త రైలును తయారు చేయనున్నారు. మేధా హైస్పీడ్ ప్రొపెల్షన్ వ్యవస్థలను తయారుచేస్తుండగా.. ఈ టెక్నాలజీని ఇప్పటికే వందేభారత్ రైళ్లలో వినియోగిస్తున్నారు.