శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు శని,ఆది సెలవు రోజులు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధనలను చేశారు. ఈ సందర్భంగా దర్మపథంలో నిత్యకళారాధన ఆకట్టుకుంది. సాయంత్రం తిరుపతికి చెందిన సహస్ర అకాడమీ బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వినాయక కౌత్వం, శివస్తుతి, శివకైవారం, ఓం నమఃశివాయ శివాయ నమ తదితర శైవగీతాలకు కళాకారులు నృత్యప్రదర్శన నిర్వహించారు.