అదానీ వ్యవహారంలో ఏపీ ప్రస్తావన రావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపికి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇలాంటి సంఘటనలకు కారకులైన వారిని సమర్ధించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పార్లమెంట్ అనెక్స్‌లో ఇవాళ(ఆదివారం) ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. పలు కీలక అంశాలపై ఈ సభలో చర్చించారు. సభలో చర్చించిన పలు అంశాలను లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు వెల్లడించారు.
ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరానని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు. విభజన హామీల్లో కొన్ని సంస్థలకు శాశ్వత కట్టడాలు వచ్చాయి. కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని సంస్థలు ఏర్పాటు కావాలని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.