అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయంగా ఎదిగిపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు కలిశారని.. రహస్యంగా కలవడంలో అంత అంతర్యమేమిటని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు కూడా చాలామందిని కలిశారని... అధికారికంగా కలిసి మీడియాకు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... వారిద్దరి రహస్య చర్చ గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను అవినీతి చేయలేదని జగన్ అంటున్నారని... తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్ని అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు.