చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, మూడు విడతల ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు చదువు మానుకోవాల్సి వస్తోందని వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో ధ్వజమెత్తడం తెలిసిందే. దీనిపై ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అంశాల వారీగా ఐదు పాయింట్లతో బదులిచ్చారు. చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పిని తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉంది జగన్ గారు! గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన మీది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్ బాల్ ఆడుకుంది మీరు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది సుప్పిని జగన్ గారు. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నేను యువగళం పాదయాత్ర చేసేటప్పుడే మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించాం. ఇకపై ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నాం. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకుని గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధంగా చెయ్యకుండానే సిబిఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక సీబీఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన పరీక్షల్లో 90శాతం మంది ఫెయిలయ్యారు. నీ నిర్ణయాలు బ్లైండ్‌గా ఫాలో అయితే ఆ పిల్లలు అంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లోకి వెళ్లేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా, టోఫెల్, ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేసామని డబ్బా కొట్టుకోవడం. ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్ గారు. నాడు - నేడు అంటూ పబ్లిసిటీ పీక్కు తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలింది. నా క్షేత్రస్థాయి పర్యటనల్లో కనీసం పిల్లలు కూర్చోడానికి బల్లలు, తాగునీరు, టాయ్ లెట్లు లేని పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వలన జరుగుతున్న అనర్ధాలను మీరు నేరుగా తల్లితండ్రులను అడిగి తెలుకోవచ్చు. అందుకే మేము స్కూళ్లలోనే పిల్లల సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.రాష్ట్రంలో గత ఐదేళ్లలో మీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీతో భర్తీచేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం.లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే కనికట్టు విద్యలో మాస్టర్స్ చేసిన మీకు విద్యారంగంలో మేం చేస్తున్న మంచిపనులు కన్పించకపోవచ్చు. ఎవరేమనుకున్నా రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబుగారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యారంగ సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే!