శ్రీకాకుళం, జి.సిగడాం మండలం సంతవురిటి పాత దళితవాడలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన కేతుబారిక సోములు భార్య దుర్గమ్మ వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు అగ్నికీలలు వ్యాపించాయి. ఆమెకు సరిగా కళ్లు కనిపించవు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఇరుగుపొరుగు వారు కూడా పొలంలో వరికోతల పనులకు వెళ్లిపోయారు. కాగా.. రెప్పపాటులో పొగ కమ్ముకుని.. మంటలు వ్యాపించాయి.
దీంతో కేతుబారిక సోములు, లండ లక్ష్మణరావు, కోడిగుడ్ల అదెమ్మ, తలే సంతోష్కుమారి, కేతుబారిక అసిరయ్య, కేతుబారిక దాలెమ్మ, కేతుబారిక ఎరకయ్యమ్మ, కరజాడ ఈశ్వరరావు, కేతుబారిక శంకరరావు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బంగారు ఆభరణాలు కూడా కాలిపోవడంతో బోరున విలపించారు. గ్రామస్థుల సమాచారం మేరకు పొందూరు, రాజాం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రెవెన్యూ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు రూ.9లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు మూడేసి కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.