రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి నవంబరు ఒకటో తేదీ వరకు విజయవాడలో ‘బిజినెస్ ఎక్స్‌పో-2024’ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని చెప్పారు. శనివారం స్థానిక చాంబర్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ సంస్థ ప్రతినిధులతో కలిసి బిజినెస్ ఎక్స్‌పో బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యాపారాభివృద్ధికి దోహదపడేలా ఈ బిజినెస్ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అద్భుతమైన పారిశ్రామిక పాలసీలను తీసుకురావడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న వనరులు, వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలపై వివిధ రంగాలవారీగా నిపుణులతో సెమినార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.